ఐ ఫోన్​ కాజేసేందుకు దారిదోపిడీ..దొంగలను పట్టుకున్న పోలీసులు

ఐ ఫోన్​ కాజేసేందుకు దారిదోపిడీ..దొంగలను పట్టుకున్న పోలీసులు

వనపర్తి, వెలుగు: స్నేహితుడి తమ్ముడి ఐ ఫోన్​ను దొంగిలించి పోలీసులకు దొరికిపోయారు. ఏఎస్పీ ఉమామహేశ్వరరావు,  డీఎస్పీ వెంకటేశ్వర్ రావుతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్​ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గద్వాలకు చెందిన షేక్​ అహ్మద్​ తమ్ముడు ఇర్ఫాన్​ ఈ నెల 26న ఐ ఫోన్​ కొనుక్కునేందుకు ఇంట్లో వారికి తెలియకుండా రూ.80 వేలు తీసుకుని విజయవాడ వెళ్లాడు.

తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్​లో అనుమానాస్పదంగా ఉన్న ఇర్ఫాన్​ను రైల్వే పోలీసులు ప్రశ్నించి, అతని అన్న అహ్మద్​కు ఫోన్​ చేసి చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లి మిర్యాలగూడలో ఉండే తన తమ్ముడు నవాజ్​కు ఫోన్​ చేసి ఇర్ఫాన్​ను ఇంటికి తీసుకెళ్లమని చెప్పింది. ఇదిలాఉంటే తమ్ముడిని తీసుకొచ్చేందుకు అహ్మద్​ మిర్యాలగూడకు వెళ్తూ తన స్నేహితుడు రామాంజిని వెంట తీసుకెళ్లాడు.

ఇద్దరు కారులో వెళ్లి ఇర్ఫాన్​ను అక్కడే ఉండమని చెప్పి, అతడి దగ్గర ఇన్న ఐ ఫోన్​ను తీసుకొని గద్వాలకు బయలుదేరారు. ఎలాగైనా ఐ ఫోన్​ను కాజేయాలని భావించిన రామాంజి గోపాల్​పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన బంధువు పొడుగు రాజేశ్​కు సమాచారమిచ్చి దారిదోపిడీ చేయాలని సూచించాడు. రాజేశ్​ తనకు తెలిసిన విజయ్​కుమార్, మహ్మద్​ సల్మాన్, అశోక్​లకు విషయం చెప్పి దారి దోపిడీకి పాల్పడ్డారు.

మినిట్​ టు మినిట్​ వివరాలు రామాంజి చెబుతుండగా, బుద్దారం నుంచి వనపర్తికి వెళ్లే దారిలో కారును అడ్డగించి అహ్మద్​ను కొట్టి అతడి వద్ద ఉన్న ఐ ఫోన్, మరో ఫోన్, రూ.15 వేల నగదు, అనుమానం రాకుండా రామాంజి ఫోన్​ను లాక్కున్నారు. ఈ ఘటనపై అహ్మద్​ గోపాల్​పేట స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. విచారణ అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేసి ఐ ఫోన్, మరో మూడు ఫోన్లు, రూ.15వేల నగదు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

కేసును చేధించిన వనపర్తి సీఐ ఎం కృష్ణయ్య, గోపాలపేట ఎస్సై నరేశ్​కుమార్, సీసీఎస్  ఎస్సై రామరాజు, సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, నగేశ్, శ్రీనివాస్, ఆంజనేయులు, అభిషేక్, రాజారాం, మౌలనా, మురళిని ఎస్పీ  అభినందించారు.  తదితరులు ఉన్నారు